" చరిత్రను తెలుసుకోకుండా గాలి మాటలు మాట్లాడుతూ రాయల సీమ అంటే పాలెగాళ్ళ రాజ్యం, బాంబుల రాజ్యం అనే అపప్రథను ప్రసార మాథ్యమాలూ, సినిమాలూ కలిగిస్తున్నాయి. తొలి తెలుగు సినిమాలకు రాయల సీమలో అంకురార్పణ జరిగింది. తొలి తెలుగు పత్రిక రాయలసీమలో పుట్టింది. గ్రంథాలయ ఉద్యమానికీ పునాది వేసిందీ ఇక్కడే! గాంథీ మహాత్ముడు మూడు సార్లు కడప జిల్లాలో పర్యటించాడు. బుడ్డా వెంగళ రెడ్డి, వంటి దానపరులూ, ఉయ్యాల వాడ నరసిం హా రెడ్డి వంటి స్వాతంత్ర్య సమర వీరులూ వేమన, బ్రహ్మంగారి వంటి తాత్వికులూ అన్నమయ్య లాంటి పదకవితా పితామహులూ రాయలసీమలోనే పుట్టారు. తెలుగు రాయలు శ్రీ కృష్ణదేవరాయలు ఇక్కడివాడే! నవీన జలయజ్ఞానికి మూలపురుషుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి రాయలసీమ వారే కదా! క్షేత్రయ్య, శ్రీనాథుడూ ఇక్కడివారే నని రచయిత సూర్య నారాయణ రెడ్డి కొన్ని ఉదాహరణలిచ్చారు. నాదముని రాజు, గుత్తికొండ వీరాస్వామి, సినిమా దర్శకులు బి. ఎన్. రెడ్డి, బి. నాగి రెడ్డి, నటులు పద్మనాభం,నాగయ్య, కవులు పుట్టపర్తి నారాయణా చార్యులు, గజ్జల మల్లా రెడ్డి , బాలసౌరి రెడ్డి మొదలైన వారి విశేషాలతో సాహిత్య సమాచారాని నిష్పాక్షికంగా రచయిత సూర్యనారాయణ రెడ్డి అందించారు. రచయిత ఈ గ్రంథం ఎంత ఆవేదనతో రాశారో తన "నామాట" చదివితే అర్థం అవుతుంది. చివర ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి ఒక మాట రాస్తూ " వీళ్ళందర్నీ మల్లేశ్వరి సినిమా ఒకమారు మళ్ళీ చూడమనండి. మల్లేశ్వరి దర్శకుడు బి.ఎన్. రెడ్డి జన్మించిన వై. కొత్తపల్లెకు వచ్చి చూడమనండి. సింహాద్రిపురం వచ్చి చూడమనండి". అన్నారు. రచయిత చాలా శ్రమించి ఎన్నో వివరాలు సేకరించి పాఠకులకు అందించారు. రాయలసీమ అంతే బాంబులూ, కత్తులూ, కొడవళ్ళూ అని ఇతర ప్రాంతాల వారిని భ్రమింప చేస్తున్న మీడియా వారూ, సినిమా వారూ , రాయలసీమ గొప్పతనం అంటే తెలియని వారెవరైనా ఈ గ్రంథాన్ని చదివితే ఎంతో అభినందనీయుడైన ఈ రచయిత కృషి ఫలించినట్లే!
-నోరి సుబ్రమణ్య శాస్త్రి
పుస్తకం పేరు: చరిత్రలో పులివెందుల
రచయిత : ఎం. సూర్య నారాయణ రెడ్డి
పేజీలు: 204
వెల: రూ 150/_
ప్రతులకు: ఎం. రాహుల్,
1/410 , శ్రీ రామా థియేటర్ దగ్గర,
పులివెందుల - 516 390 ,
కడప జిల్లా
మొబైల్ : 9440018958